
రాష్ట్రస్థాయికి 16 మంది క్రీడాకారుల ఎంపిక
మెదక్‌జోన్: త్వరలో చైనాలో నిర్వహించనున్న అంతర్జాతీయ పాఠశాలల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు గురువారం అండర్ 15 బాలబాలికలకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు పాఠశాల క్రీడా సమాఖ్య అధికారి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఈఓ ఆదేశాల మేరకు పట్టణంలోని గుల్షన్ క్లబ్‌లో ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 110 మంది బాలికలు, 150 మంది బాలురు పాల్గొన్నారన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 8 మంది బాలికలు, 8 మంది బాలురు రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరంతా ఈనెల 18, 19 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుల్షన్ క్లబ్ కార్యదర్శి మధుసూదన్ రావు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ప్రభు, పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మధుసూదన్, వినోద్, నరేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.