
మహాత్మా.. మన్నించు!
జగదేవ్‌పూర్(గజ్వేల్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటారు. అయితే భారత స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మాగాంధీని మాత్రం మరిచిపోతున్నారు. పలు చోట్ల జాతిపిత విగ్రహాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో భాగంగానే మండలంలోని తిగుల్‌లో ఖచీర్ వద్ద బురుజు పక్కన గద్దైపె దశాబ్ధాల క్రితం గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. పదేళ్ల క్రితం రోడ్డు వెడల్పులో గాంధీ విగ్రహాన్ని తీసి పక్కన పెట్టి ప్రతిష్టంచకుండా వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విగ్రహాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. కావున వెంటనే గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని స్థానికులు కోరుతున్నారు.
»
»