
చెక్‌డ్యాంలకు నిధుల జాడేది?
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గంలో శాశ్వత నీటి వనరులు లేవు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు లేక రైతులు బోరుబావులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. నారింజ ప్రాజెక్టు ఉన్నా ఆయకట్టుకు నీరు అందించలేని స్థితిలో ఉంది. దీంతో భూగర్భ జలాలు పెంచాలని నిర్ణయించి చెక్‌డ్యాంల నిర్మాణానికి నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఏడాది గడుస్తున్నా ఇంత వరకు నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామం వద్ద సుమారు ఆరు దశాబ్దాల క్రితం నారింజ ప్రాజెక్టును 600 ఎకరాల్లో నిర్మించారు. 15 ఫీట్ల ఎత్తులో ఉన్న ప్రాజెక్టులో సుమారు ఒక క్యూసెక్కు నీటి నిలువ ఉంటుంది. వేయి ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రాజెక్టును కట్టారు. కానీ కుడి, ఎడమ కాలువల నిర్మాణ లోపం వల్ల ఇప్పటి వరకు ఎకరం పొలానికి కూడా నీరందలేదు. దీంతో ప్రాజెక్టును ఊట చెరువుగా మార్చేశారు. శాశ్వత నీటి వనరులు లేని ప్రాంతంలో ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని రైతులు, ఉద్యమకారులు, తదితరులు ఎన్నోసార్లు ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వాలు మారినా దాని గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా ప్రతి సంవత్సరం రెండు మూడు టీఎంసీల నీరు కర్నాటక రాష్ట్రానికి తరలిపోతుంది.
రూ.24.26 కోట్లతో ప్రతిపాదనలు
నారింజ ప్రాజెక్టులో సుమారు ఒక క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. ఒకటి, రెండు భారీ వానలకే ప్రాజెక్టు నిండిపోయి జలకళ సంతరించుకుంటుంది. వర్షాకాలం భారీ వానలు పడితే గేట్లు ఎత్తి ఆ నీరంతా వృథాగా కర్నాటకకు వదిలేస్తున్నారు. ప్రతి సంవత్సరం రెండు, మూడు టీఎంసీల నీరు తరలిపోతుంది. నీరు పక్క రాష్ట్రం పాలు కాకుండా ఉండేందుకు ప్రాజెక్టు కింద చెక్‌డ్యాంలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.24.26 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మండలంలోని నారింజ వాగుపై బుర్దిపాడ్, బూచినెల్లి, సత్వార్, చిరాగ్‌పల్లి గ్రామాల శివారులో చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేవు. ఇప్పటికై నా నిధులు విడుదల చేసి చెక్‌డ్యాంల నిర్మాణానికి చొరవ తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
రెండు రోజులుగా..
రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వరద నీరు వచ్చింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో పెద్ద ఎత్తున నీరు కర్నాటక వైపు వెళ్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో భారీ వానలు పడిన సందర్భాల్లో ఇలా నీరు వృథాగా పోతుంది. చెక్‌డ్యాంల విషయమై ఇరిగేషన్ డీఈని వివరణ కోరగా.. ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రతిపాదనలకే పరిమితం
నారింజ’ నీరు కర్నాటక పాలు
నష్టపోతున్న రైతులు
పట్టించుకోని అధికారులు