
ఆటాడుకుందాం రా!
ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి, శరీర దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి విద్యార్థులకు క్రీడలు దోహదపడతాయి. చదువుతోపాటు వారికిష్టమైన క్రీడాపోటీలను ప్రభుత్వం ప్రతియేటా నిర్వహిస్తుంది. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడంచెలలో నిర్వహించనున్న ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడలు.. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు అధికారులు దృష్టి సారించారు.
20 నుంచి మండల స్థాయిలో..
● సెప్టెంబర్‌లో జిల్లా స్థాయి పోటీలు
● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లాలో 990 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 211 ఉన్నత, 22 కేజీబీవీలు, 10 మోడల్, 109 గురుకుల, సాంఘీక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. అలాగే సుమారు 500 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 3.40లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అండర్ 14, అండర్ 17 విభాగంలో బాల, బాలికలు పాల్గొననున్నారు.
ఆటలు ఇవే..
ఎస్‌జీఎఫ్‌లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, కరాటే, బ్యాడ్మింటన్, తైక్వాండో, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, షటిల్, చదరంగం, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, పెన్సింగ్, క్రికెట్, రెజ్లింగ్ తదితర క్రీడలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో బాల,బాలికలు పాల్గొంటారు. అయితే మండల స్థాయిలో మాత్రం ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు మాత్రమే నిర్వహిస్తామని, మిగతా ఆటలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
పది రోజుల పాటు పోటీలు
ఈ నెల 20 నుంచి మండల స్థాయి క్రీడలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్ ఆటలు మాత్రమే నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారికి సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో జిల్లా స్థాయి, అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గెలిచిన వారికి అధికారులు ధ్రువ పత్రాలు అందజేస్తారు. అవి భవిష్యత్‌లో ఉద్యోగ నియామకాల్లో ఉపయోగపడతాయి. పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.