
‘ములుగు’తో కపిల్ ఒప్పందం
ములుగు(గజ్వేల్): ములుగు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన కపిల్ ఆగ్రో పామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య మంగళవారం అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వర్సిటీ వీసీ డాక్టర్. రాజిరెడ్డి, కపిల్ పామ్స్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ... విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ, అధిక దిగుబడి, పంట ఉత్పత్తి కోసం సాంకేతిక బదిలీపై దృష్టి సారించడమే లక్ష్యమన్నారు. అలాగే ఉద్యాన వనంలో ఉమ్మడి విద్య, పరిశోధన, విస్తరణ కార్యకలాపాలను ప్రొత్సహించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దీనివల్ల వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు వినూత్న ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ నేల, ఆకు విశ్లేషణ తదితర అంశాల గురించి తెలుసుకుంటారని పేర్కొన్నారు.