
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
ఎస్పీ డీవీ
శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు కావాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నషా ముక్త్ భారత్ అభియాన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నషా ముక్త్ భారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్ , డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌గౌడ్, ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఆర్‌ఐ రామకృష్ణ, శైలేందర్, మణి పాల్గొన్నారు.
నియంత్రణ అందరి బాధ్యత: డీఎస్పీ ప్రభాకర్
పటాన్‌చెరు టౌన్: డ్రగ్స్ రహిత ప్రదేశంగా మార్చడానికి సాయశక్తులా కృషి చేస్తున్నామని, దీనికి అందరి సహకారం అవసరమని పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘నషా ముక్తి భారత్ అభియాన్’ను పురస్కరించుకుని రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కమిటీ, స్థానిక పోలీస్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన సవాలుగా మారిందని, దానిపై యువతకు అన్ని కోణాల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ , డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ శివ దీప్తి, డాక్టర్ సురేశ్ , ఎస్‌ఐలు శ్రీశైలం, హిమబిందు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం