నైరాశ్యంలో నిరుద్యోగులు
● ఎదురు చూపుల్లో లబ్ధిదారులు
● జాప్యంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
● యువతలో ఎన్నికల నోటిఫికేషన్ భయం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని సంకల్పించింది. యువత నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించి, లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను సైతం ఉన్నతాధికారులకు పంపించింది. కానీ రుణాలు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు. – హుస్నాబాద్
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు రూ.50వేలు, రూ.లక్ష , రూ. 2లక్షలు, రూ.3లక్షలు, రూ.4లక్షల లోపు సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనుంది. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 5 కేటగిరిల కింద ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను తీసుకున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు అధికారులు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పథకం కింద మొత్తం 1528 దరఖాస్తులు వచ్చాయి. రూ.50వేల లోపు వాటికి బ్యాంక్ లింకేజీ లేకుండా పూర్తి సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఇచ్చే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా సబ్సిడీ ఇచ్చేలా పథకాన్ని రూపొందించారు. మొదట రూ.50వేలు, రూ.లక్షలోపు వారికి బ్యాంకుల ద్వారా గ్రౌండింగ్ చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకుల వారీగా జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈ జాబితాను ఉన్నతాధికారులకు కూడా అందజేశారు.
రుణాల కోసం ఎదురుచూపులు
యువ వికాసం కింద దరఖాస్తు చేసుకుని దాదాపు మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికే రూ.50వేలు, రూ.లక్ష యూనిట్ల కింద అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. బ్యాంకర్లు ఇచ్చే జాబితాతోపాటు లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకుల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందిస్తామని ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల రుణాల అందజేత వాయిదా వేశారు. దీంతో లబ్ధిదారులు రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ రుణాలు మంజూరు కాలేదు. ఈ ప్రభుత్వంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో రుణాలు పొందుతామని ఆశపడ్డారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైన జారీ చేసే అవకాశం ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రుణాల జాబితాను ఎప్పుడు ప్రకటిస్తారోనని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చేయకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే మరో 6 నెలల వరకు వేచి ఉండాల్సిందే. నోటిఫికేషన్ ముందుగానే రుణాలు మంజూరు చేస్తుందా? లేదా అనేది వేచి చూడాలి.
ఉన్నతాధికారులకు పంపించాం
రాజీవ్ వికాస పథకం కింద నిరుద్యోగ యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దరఖాస్తులను పరిశీలించి ఆయా బ్యాంకులకు పంపించాం. బ్యాంకులు ఎంపిక చేసిన జాబితాను ఉన్నతాధికారులకు పంపించాం. రుణాల గ్రౌండింగ్ తుది నిర్ణయం ప్రభుత్వానిదే. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత జాబితాను ప్రకటిస్తాం.
–మల్లికార్జున్,
మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్
యువ వికాసమేదీ?