
అగ్గి రాజేసిన కబ్జా వార్త
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాటల యుద్ధం ● మాజీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం ● పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత
పెద్దశంకరంపేట(మెదక్): సోషల్ మీడియాలో వచ్చిన ఓ వార్త కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య అగ్గిరాజేసింది. పరస్పర దాడులకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన మంగళవారం పెద్దశంకరంపేటలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ‘మీరంటే మీరు’అంటూ ఇరు పార్టీల మధ్య వాట్సాప్‌లో చర్చ సాగింది. చివరకు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునే స్థాయికి చేరింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటి ముట్టడికి వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాస్ ఇంట్లో లేకపోవడంతో రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. అదే సమయంలో మండల పరిధిలోని జూకల్‌లో పర్యటన ముగించుకొని పెద్దశంకరంపేటకు వచ్చిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జంగం శ్రీనివాస్‌ను చూసి అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. నినాదాలు చేస్తూ భూపాల్‌రెడ్డి వాహనంపై ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి తన సిబ్బందితో కలసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం, వాట్సాప్ గ్రూపులలో ఒకరిపై ఒకరు దూషణలకు పాల్పడితే అడ్మిన్‌తో పాటు అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.