
నిమ్జ్ రహదారి పనులు పూర్తి
జహీరాబాద్: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్)కు పరిశ్రమల రాకకోసం ప్రత్యేకంగా రూ.173 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో మిగతా పనులన్నీ పూర్తికానున్నాయి. సుమారు 9.3 కిలోమీటర్ల మేర 100 అడుగుల విస్తీర్ణంతో బీటీ రహదారిని నిర్మించారు. రూ.100 కోట్లు నిమ్జ్ ప్రాజెక్టు నుంచి మిగతా రూ.73 కోట్లు టీజీఐఐసీ నుంచి నిధులు కేటాయించారు. జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి జంక్షన్ నుంచి ఝరాసంగం మండలంలోని ఎల్గొయి గ్రామ పరిధిలోని నిమ్జ్ ప్రాజెక్టు వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ రహదారిని హుగ్గెల్లి జంక్షన్ వద్ద 65వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేశారు. జాతీయ రహదారి నుంచి వచ్చి పోయే వాహనాలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు వీలుగా సర్వీస్ రోడ్లను నిర్మించారు. ప్రస్తుతం సర్వీసు రోడ్డు వద్ద మైనర్ పనులు మాత్రమే మిగిలి ఉండగా..వారంలో పనులు పూర్తి చేస్తామని అధికారు చెబుతున్నారు. ప్రస్తుతం బైపాస్ వద్ద నిర్మించిన సర్వీస్ రోడ్డు సైడ్ వాల్స్‌లకు రంగులు అద్దే పనులు చేపట్టారు.
చివరి దశలో ఎలక్ట్రిక్ పనులు
రహదారిపై చేపట్టిన ఎలక్ట్రిక్ పనులు సైతం చివరి దశలో ఉన్నాయి. సుమారు రూ.3.50 కోట్ల మేర నిధులను విద్యుత్ పనులకు కేటాయించారు. 9 కిలోమీటర్ల పొడవున 365 విద్యుత్ స్థంభాలు ఇరువైపులా లైట్లు వెలిగేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అయితే నిమ్జ్ ప్రాజెక్టు ఇన్‌గేట్, ఔట్‌గేట్ వద్ద హైమాస్ట్ లైట్లను బిగించేందుకు ప్రతిపాదించారు. ఈ పనులను మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పనులు సైతం వారం రోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
2013లో నిమ్జ్ ప్రాజెక్టు మంజూరు
నిమ్జ్ ప్రాజెక్టు 2013లో మంజూరైంది. న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో నిమ్జ్ ప్రాజెక్టు కోసం 12,635ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 6,790 ఎకరాల భూ సేకరణ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రూ.2,361 కోట్ల వ్యయంతో స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిమ్జ్ ప్రాజెక్టు కోసం గుర్తించిన భూమిలో స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నారు.
వారం రోజుల్లో వినియోగంలోకి
రూ.173కోట్ల వ్యయంతో
నిర్మాణ పనులు
వంద అడుగుల వెడల్పుతో9.3 కిలోమీటర్ల బీటీ రహదారి