
యాంత్రీకరణకు మోక్షం
నిధుల కేటాయింపు ఇలా..
జిల్లా నిధులు(రూ.) యూనిట్లు
మెదక్ 1,08,40,408 2,713
సంగారెడ్డి 2,23,45,603 7,883
సిద్దిపేట 1,64,79,528 5,679
● ఎట్టకేలకు రాయితీపై సాగు పరికరాలు
● ఏడేళ్ల తర్వాత నిధుల కేటాయింపు
● ఉమ్మడి జిల్లాకు 16వేల యూనిట్లు
● రూ.4.96కోట్లు మంజూరు
● మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ
● లబ్ధిదారులను ఎంపిక చేయనున్న కమిటీలు
వ్యవసాయ యాంత్రీకరణకు మోక్షం లభించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత వ్యవసాయ పరికరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఈ ఏడాది కేవలం పనిముట్లకే పరిమితం చేశారు. పంటల సాగులో కూలీల ఖర్చును తగ్గించడానికి వ్యవసాయ యాంత్రీకరణ దోహదపడనుంది. 2025–26 సంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు 16,275 యూనిట్లకు రూ.4.96కోట్లు మంజూరు చేశారు. త్వరలో రైతులకు పరికరాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 12లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు అందించే వ్యవసాయ పరికరాలను మహిళా రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం రాయితీపై ఇవ్వనున్నారు. మిగతా వారికి 40శాతంతో అందించనున్నారు. ఐదు ఎకరాలకంటే తక్కువ భూములు ఉన్న రైతులకు సబ్సిడీ పై వివిధ రకాల పరికరాలు అందిస్తారు. స్ప్రేయర్లు, ట్రాక్టర్‌తో నడిచే వ్యవసాయ పరికరాలు రోటోవేటర్లు, నాగళ్లు, గొర్రు, కలుపు తీసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రం తదితర వాటిని అందజేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు, అత్యల్పంగా మెదక్ జిల్లాకు నిధులు కేటాయించారు.
ఎంపిక బాధ్యత కమిటీలదే..
వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేసేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి. ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీ పథకానికి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఏఓ, ఆగ్రోస్, ఎల్‌డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు. ఈ పరికరాల కోసం అర్హులను ఈ కమిటీలు ఎంపిక చేయనున్నారు.
ఏడేళ్ల తర్వాత..
2017–18 సంవత్సరం వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది నిధులను మంజూరు చేశారు. గతంలో ట్రాక్టర్లు అందించే వారు. ఈ ఏడాది కేవలం యాంత్రీకరణ పనిముట్ల వరకే పరిమితం చేశారు. గతంలో మాదిరిగా ట్రాక్టర్లు సైతం అందిస్తే రైతులు ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.