
బడులకు హరిత రేటింగ్
నారాయణఖేడ్: విద్యార్థి దశనుంచే పర్యావరణ పరిరక్షణ, సమాజాన్ని చైతన్య పరిచేలా పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రేటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గతంలో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ స్థానంలో ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్)ను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రస్థాయిలో 20 పాఠశాలలకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. ఫైవ్‌స్టార్ రేటింగ్‌కు ఎంపికై న పాఠశాలలను జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. దీంతోపాటు ఉత్తమ స్కోర్ సాధించిన పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపునిస్తారు. ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో గరిష్టంగా 20 పాఠశాలలకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 30వరకు ఎస్‌హెచ్‌వీఆర్ పోర్టల్‌లో వివరాలను ఆయా పాఠశాలలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది.
పలు పాఠశాలల్లో కార్యక్రమాలు
జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పచ్చదనం, పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. చాలా పాఠశాలలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. జిల్లాలో ఇటీవలి కాలంలో మన ఊరు మన బడి పథకం కింద 441 పాఠశాలల్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాలల మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం, చిత్రలేఖనం, ఆధునిక టాయ్‌లెట్ల నిర్మాణం, పూర్తిస్థాయిలో కిచెన్‌షెడ్‌లు, డైనింగ్, వాష్ ఏరియా ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఈడీ సిస్టమ్స్, సంప్‌హౌజ్‌ల నిర్మాణం, కూర్చోడానికి డోల్‌డెక్స్‌ల ఏర్పాటు తదితరాలను చేపట్టారు.
పచ్చదనం..పరిశుభ్రత పెంపు లక్ష్యం
పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరతకు పాఠశాలలను చిరునామాగా మార్చడం, వాటిపై విద్యార్థులకు అవగాహన పెంచడం, ఎస్‌హెచ్‌వీఆర్ 2025–26లక్ష్యంగా కేంద్రం నిర్ధారించింది. ఇప్పటికే పలు పాఠశాలల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పచ్చదనం, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎస్‌హెచ్‌వీఆర్ కింద ఎంపికయ్యే పాఠశాలకు రూ.లక్ష నగదు బహుమతిని అందజేస్తారు. సదరు పాఠశాల హెచ్‌ఎంను మూడు రోజులపాటు ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు.
ఎంపికయ్యే పాఠశాలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం
గతేడాది స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌కు జిల్లా దూరం
ఎక్కువ పాఠశాలలు ఎంపికయ్యేలా చూస్తాం
కేంద్రంనుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈసారి జిల్లాలో ఎక్కువ పాఠశాలలు ఎంపికయ్యేలా కృషి చేస్తాం. ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తాం. రేటింగ్‌కు అధిక పాఠశాలలు ఎంపికయ్యేలా చూస్తాం. ఈసారి జిల్లాకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం వచ్చేలా కృషి చేస్తాం.
– వెంకటేశ్వర్లు,
జిల్లా విద్యాశాఖ అధికారి, సంగారెడ్డి

బడులకు హరిత రేటింగ్