
కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగ అవకాశాలు
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు
నరసింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: కాంగ్రెస్ హయాంలోనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనతో తోషిబా పరిశ్రమలో పెట్టుబడులు వచ్చాయని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారం తోషిబా పరిశ్రమలో శుక్రవారం నూతన ప్లాంట్ ఆవిష్కరణలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకట స్వామి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఐఎన్‌టీయూసీ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వేలాది పరిశ్రమల ఏర్పాటు, లక్షలాది కార్మికుల జీవనోపాధి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, తోషిబా పరిశ్రమ ఐఎన్‌టీయూసీ నాయకులు సుందర్, ఎల్లయ్య, సుధాకర్, రాజు, సంజీవ్ కార్మిక సంఘం నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తొలగించిన ఓట్లను చేర్చాలి
గాంధీ విగ్రహం వద్ద సీపీఎం నిరసన
జహీరాబాద్ టౌన్: బిహార్‌లో రద్దు చేసిన 64 వేల ఓట్లను పునరుద్ధరించాలని కోరుతూ సీపీఎం నాయకులు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రాంచందర్ మాట్లాడుతూ...ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషన్ బిహార్‌లో ప్రతిపక్షాలకు సంబంధించిన వేల ఓట్లను తొలగించిందని ఆరోపించారు. ఎస్సీ నియోజకవర్గంలో 60% నుంచి 40% ఓట్లు తగ్గించారని మండిపడ్డారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వాపోయారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మహిపాల్, సుకుమార్, నర్సింహులు, బక్కన్న, సంజీవ్ పాల్గొన్నారు.
టేబుల్ టెన్నిస్‌లో
సత్తా చాటిన అహీల్
లక్డీకాపూల్:హైదరాబాద్‌కు చెందిన ఎండీ అహీల్‌టేబుల్ టెన్నిస్‌లో సత్తా చాటారు. ఇటీవల ఒడిశాలోని కళింగ స్టేడియంలో టాబ్ ఏఐటీఏ–ఒటీఏ చాంపియన్‌షిప్ సిరీస్(సీఎస్7) పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఎస్– 7 అండర్ 14 విభాగంలో తెల్లాపూర్‌కు చెందిన అహీల్ బెంగళూర్‌కు చెందిన నమన్ స్వరూప్‌ను 7–5, 6–4 తేడాతో ఓడించారు.
కిర్బీలో సీఐటీయూ విజయం
బీఆర్టీయూపై చుక్కా రాములు గెలుపు
పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీ పరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూ నాలుగోసారి విజయ దుందుభి మోగించింది. సీఐటీయూ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు బరిలో నిలిచారు. పరిశ్రమలో మొత్తం 578 ఓట్లకు గాను 576 ఓట్లు పోలవగా 2 ఓట్లు చెల్లలేదు. సీఐటీయూకు 295, బీఆర్టీయూ కూటమికి 281 ఓట్లు రాగా 14 ఓట్ల తేడాతో చుక్కా రాములు విజయం సాధించారు.

కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగ అవకాశాలు