
సామ్రాజ్యవాదవిధానాలతో ప్రమాదం
గజ్వేల్‌రూరల్: అమెరికా సామ్రాజ్యవాద విధానాలతో ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య అన్నారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్యూబాకు సంఘీభావ నిధికి కార్మికుల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాకు దగ్గరలో ఉన్న క్యూబా దేశాన్ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. కరోనా సమయంలో వైద్యులు, నర్సులు, మందులను పంపించి క్యూబా ఉచితంగా ప్రపంచానికి సేవ చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, స్వామి, భిక్షపతి, సాజిద్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై దాడి
– ఎనిమిది మందిపై కేసు
హవేళిఘణాపూర్(మెదక్): పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన 8మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,279 నగదు, 11 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని, చట్ట విరుద్ధమైన పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.