
అసైన్డ్ భూముల్లో మట్టి రవాణా
అడ్డుకున్న రైతులు
జిన్నారం (పటాన్‌చెరు): అసైన్డ్ భూముల నుంచి అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను రైతులు అడ్డుకున్నారు. మండల కేంద్రంలోని సర్వేనం.1 అసైన్డ్ భూములను పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రైతుల నుంచి స్వాధీనం చేసుకుంది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కింద ఎకరానికి 600 గజాల చొప్పున కేవలం పట్టాలను అందజేసి పొజిషన్ కూడా చూపకుండా చేతులు దులుపుకుంది. న్యాయం చేయాలని బాధిత రైతులు అధికారుల వద్ద పలుమార్లు వారి గోడును వెళ్లబోసుకున్న పట్టించుకోలేదని తెలిపారు. కాగా పరిశ్రమల పేరిట భూములను స్వాధీనం చేసుకున్న కొందరు కొన్ని రోజులుగా ఆ భూముల నుంచి అక్రమంగా మట్టిని వేరే ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో శుక్రవారం బాధిత రైతులు అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇటు భూములు కోల్పోయి, అటు పరిహారం అందక అయోమయానికి గురవుతున్నామని వాపోయారు. ఈ సమయంలో మట్టి రవాణా చేస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారని అధికారులకు వివరించారు. బాధిత రైతులు విట్టల్, రమేశ్, శ్రీనివాస్ గౌడ్, నర్పింలు, మల్లేశ్, శ్రీధర్ గౌడ్, స్థానికులు శ్రీకాంత్ గౌడ్, బ్రహ్మేందర్ గౌడ్ ఉన్నారు.