జాగ్రత్తలతోనే క్షయ నివారణ
డీఎంహెచ్‌ఓ గాయత్రీదేవి
కంది(సంగారెడ్డి): జాగ్రత్తలతోనే క్షయ (టీబీ)వ్యాధిని నివారించవచ్చని, క్షయ రహిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌ఓ) గాయత్రీదేవి పేర్కొన్నారు. కందిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ నివారణపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేవలం దగ్గు ఒకటే టీబీ లక్షణం కాదన్నారు. జ్వరం,శరీరంలో ఎక్కడైనా వాపు, శారీరక బరువులో అకస్మాత్తుగా తగ్గుదల, అలసట నీరసం, దగ్గినప్పుడు తెమడలో రక్తం పడటం వంటి లక్షణాలున్నవారు టీబీ పరీక్షలు వెంటనే చేయించుకోవాలని సూచించారు. టీబీకి మందులను ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా అందజేస్తారని తెలిపారు. అనంతరం టీబీ నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మోతాదుకు మించి వాడొద్దు
శాస్త్రవేత్త తబసుమ్ ఫాతిమా
న్యాల్‌కల్(జహీరాబాద్): పంటల సాగులో మోతాదుకు మించి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడొద్దని బసంత్‌పూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త తబసుమ్ ఫాతిమా సూచించారు. వీటిని అధిక మోతాదులో వాడటం వల్ల లాభాల కంటే నష్టాలే అధికంగా వస్తాయని ఫాతిమా పేర్కొన్నారు. ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని న్యామతాబాద్‌లో పంటల సాగు విధానాలపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. రైతులు విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడుతుండటంతో నేల సారం దెబ్బతినడంతోపాటు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు.
అందుబాటులోరాయితీ విత్తనాలు
నారాయణఖేడ్: జీలుగ విత్తనాలను 50% రాయితీపై అందజేస్తోందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్ సూచించారు. ఖేడ్ వ్యవసాయ కార్యాలయంలో బుధవారం రాయితీ విత్తనాల పంపిణీని ప్రారంభించి పలువురు రైతులకు విత్తన బస్తాలను అందజేశారు.
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
జహీరాబాద్: జహీరాబాద్ మండలంలోని హోతి(కె) గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యా బోధనకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. తెలుగు, బయోసైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువా లజీ పోస్టులు ఒక్కొక్కటి, ఇంగ్లిష్ 2, మ్యాథ్స్ 3 పోస్టుల చొప్పున ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనకు గాను ఆసక్తి గల అభ్యర్థులు మే 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
334మంది రైతులకు రూ.42 లక్షల పరిహారం
సంగారెడ్డి జోన్: జిల్లాలో గత రెండు నెలలుగా వడగండ్లతోపాటు అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు 334 మంది రైతులకు రూ.42 లక్షల నిధులను విడుదల చేశారు. విడుదలైన నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న పంట తోపాటు ఉద్యమ పంటల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
జాగ్రత్తలతోనే క్షయ నివారణ
జాగ్రత్తలతోనే క్షయ నివారణ


