
ఆ రెండు బల్దియాల్లో యూజీడీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ రెండు చోట్ల అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థకు పరిష్కారమే లక్ష్యంగా ఈ యూజీడీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డి పట్టణంలో ఈ యూజీడీ వ్యవస్థ కోసం రూ.580 కోట్లు అవసరమని, సదాశివపేట మున్సిపాలిటీకి రూ.273 కోట్లు అవసరమని ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ డీపీఆర్ (డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు)లను ఇటీవలే కలెక్టర్ ద్వారా కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు పంపారు. ఈ రెండు పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య, జనాభా, వార్డులు, జనసాంద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు తయారు చేశారు.
భారీ నిధులు కేంద్రానికి ప్రతిపాదనలు..
యూజీడీల నిర్మాణానికి భారీగా నిధులు అవసరం ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ నిధులను రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం), అర్బన్ ఇన్‌ఫ్రాస్టక్చర్ స్కీం వంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల కింద పట్టణాల అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఇప్పటికే అమృత్ వంటి పథకాల కింద జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేసింది. ఈ యూజీడీలకు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ద్వారా పట్టణాలను అభివృద్ధి చేయవచ్చనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ యూజీడీల ప్రతిపాదనలు సీడీఎంఏ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లినట్లు సమాచారం.
యూజీడీ డీపీఆర్‌లు పంపాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంగారెడ్డి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ డీపీఆర్‌లను జిల్లా కలెక్టర్‌కు పంపాం. పట్టణ జనాభా, కుటుంబాల సంఖ్య, జనసాంద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ విభాగం ఈ డీపీఆర్ తయారు చేశాం. నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
–ప్రసాద్ చౌహాన్,
సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్
రూ.580 కోట్లతో సంగారెడ్డి, రూ.273 కోట్లతో సదాశివపేటలో
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి ప్రతిపాదనలు
కలెక్టర్ ద్వారా ఇటీవలే సీడీఎంఏకు డీపీఆర్‌లు