
మోసగిస్తే కఠిన చర్యలే
జిన్నారం(పటాన్‌చెరు): కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసగిస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ జ్యోతి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, నిర్వాహకుల తీరుపై రైతులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా అధికారుల బృందం శుక్రవారం జిన్నా రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా అధికారుల బృందం వద్ద రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద సకాలంలో తూకం వేయకపోవడం వల్లే వర్షాలకు తమ ధాన్యం తడిసిముద్దయిందని రైతులు వాపోయారు. టోకెన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారని ఈ వ్యవహారంలో వీవోఏ భర్త పెత్తనం చలాయిస్తున్నాడని రైతులు ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ తనిఖీ చేపట్టి క్వింటాలుకు 4 కిలోల చొప్పన తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో తూకం యంత్రాలను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్లు అనిల్ తెలిపారు. ఇప్పటికే తూకంలో మోసపోయిన రైతులకు పరిహరం అందించేలా కృషి చేస్తున్నామన్నారు. స్థానిక ఏపీఎం, వీవోఏలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐకేఏపీ ఏపీఎం నరేందర్, ఏఈఓ అజారుద్దీన్ వీవోఏ లత పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్
గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ పరమేశం తనిఖీ చేశారు. నల్లవల్లి కేంద్రంలో హమాలీల కొరతను రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా...కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలను పెంచాలని నిర్వాహకులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాల తనిఖీల్లో
డీఆర్‌డీఏ పీడీ జ్యోతి