
జిల్లావాసికి ప్రధాని అభినందనలు
జహీరాబాద్: భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సంగారెడ్డి జిల్లావాసి పట్లోళ్ల లక్ష్మికాంత్‌రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. కోహీర్ మండలంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల లక్ష్మీకాంత్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం భారత వైమానిక దళంలో చేరి ప్రస్తుతం ఫ్లైట్ లెఫ్టినెంట్ ర్యాంక్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన అప్రకటిత యుద్ధం నేపథ్యంలో మిగ్ యుద్ధ విమానం, గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శనచక్ర ఎస్–400ను ధ్వంసం చేశామని పాక్ చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపించేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి దాని ఎదుటే నిల్చుని ప్రసంగించారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్న లక్ష్మికాంత్‌రెడ్డిని ప్రధాని మోదీతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా భారత జవాన్లనుద్దేశించి ‘మీ మెరుపు వేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసిందని, భారతీయులంతా మీ పోరాటానికి ఉప్పొంగి పోయార’ని ప్రధాని అభినందించారు. ప్రధానితో కరచాలనం చేసి, అభినందనలు పొందడం తమకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని లక్ష్మికాంత్‌రెడ్డి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పేర్కొన్నారు.