
కష్టం.. కన్నీళ్ల పాలు
జోగిపేట (అందోల్)/హత్నూర(సంగారెడ్డి)/సంగారెడ్డి టౌన్:
జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలకు పలు మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుమండలాల్లో కొనుగోలు కేంద్రాలవద్ద, రోడ్లమీద, కల్లాలో ఆరబెట్టిన ధాన్యపు రాసులు తడిసిముద్దయ్యాయి. సంగారెడ్డి, కంది, కొండాపూర్, పుల్కల్ , చౌటకూరు, హత్నూర, అందోల్, జోగిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోగా కొన్ని చోట్ల వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. సింగూరు డ్యామ్ వెళ్లే దారిలో ఎటు చూసినా తడిసిన ధాన్యమే కనిపించింది. ధాన్యపు రాసులపై ప్లాస్టిక్, టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచినా ప్రయోజనం లేకపోయింది. జోగిపేటలో సుమారు 12 లారీల ధాన్యం తడిసిముద్దయిపోయింది. కల్లాలో కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వచ్చి కనిపించింది. జోగిపేట మార్కెట్ కార్యదర్శి సునీల్‌తో పాటు కేంద్రం నిర్వాహకులు తడిసిన ధాన్యంను పరిశీలించారు. తడిచిపోయిన ధాన్యాన్ని చూసి రైతులు విలపిస్తున్నారు. ఆరుగాలం పనిచేసిన కష్టమంతా ఒక్క వర్షానికే నష్టంపోవడం తలచుకుని దైన్యంగా మిగిలిపోయారు. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యంతోపాటు జాప్యం లేకుండా కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి