
డిపాజిట్ డబ్బులు మాయం!
కొల్చారం(నర్సపూర్): మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌లో ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బులు మాయమయ్యాయి. గురువారం కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన కొంతమంది పోస్టాఫీస్‌లో డిపాజిట్ రూపంలో, నెల నెలా డబ్బులు వచ్చేలా రికరింగ్ డిపాజిట్ పథకంలో డబ్బులు జమ చేశారు. వీటికి సంబంధించి సిబ్బంది పాస్ పుస్తకాలు, సంబంధిత పత్రాలు ఖాతాదారులకు ఇచ్చారు. నాలుగు నెలల క్రితం అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తున్న లంబాడి రవి అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం నూతన అసిస్టెంట్ పోస్టుమాస్టర్‌గా గ్రామానికి చెందిన కొత్త శేఖర్ విధుల్లో చేరాడు. ఇటీవల ఆడిట్ నిర్వహించగా.. డిపాజిట్ల ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని శేఖర్ ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి పాసుపుస్తకాలు, డిపాజిట్ పత్రాలను తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అప్పటినుంచి తీసుకెళ్లిన వాటిని ఇవ్వాలని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఈ విషయమై శేఖర్‌ను నిలదీయగా డబ్బులు జమ చేయలేదని దబాయించాడు. దీంతో కోపోద్రికులైన ఖాతాదారులు ఆందోళనకు దిగారు. మాయమైన సొమ్ము దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి పేర రూ.5 లక్షలని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
కొల్చారం పోస్టాఫీస్ ఎదుట ఖాతాదారుల ఆందోళన
మాయమైన సొమ్ము సుమారు రూ.10లక్షలు