
పిడుగుపాటుతో మహిళ మృతి
జహీరాబాద్: పిడుగుపాటుతో మహిళ మృతి చెందిన ఘటన కోహీర్ మండలంలోని నాగిరెడ్డి పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ(55) పొలం పనులకు వెళ్లింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ నాగమ్మ గాయపడింది. వైద్యం నిమిత్తం ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మహిళ
మిరుదొడ్డి(దుబ్బాక): పురుగు మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం భూంపల్లి ఎస్‌ఐ హరీశ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్మెట కళవ్వ (52) దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండేది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది 12న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి
పాపన్నపేట(మెదక్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పొడిచన్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పొడిచన్‌పల్లికి చెందిన సర్ధన కిష్టయ్య(40)కు భార్య లక్ష్మి, కూతురు గంగమణి, కుమారుడు బీరప్ప ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారు లేచి చూసే సరికి చనిపోయి ఉన్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పాపన్నపేట ప్రొబెషనరీ ఎస్‌ఐ నరేశ్ కేసు నమోదు చేసుకున్నారు.
గేదెను తప్పించబోయి లారీ డ్రైవర్
చిన్నకోడూరు(సిద్దిపేట): గేదెను తప్పించబోయి అదుపు తప్పి లారీ బోల్తా పడటంతో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని రామునిపట్ల శివారులో రాజీవ్ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంచిర్యాల జిల్లా కాసీంపేట మండలం, మల్కపల్లి గ్రామానికి చెందిన వల్లూరి రాకేశ్ (26) సిద్దిపేటకు చెందిన వ్యాపారి వద్ద లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంచిర్యాల నుంచి సిమెంట్ లోడ్ లారీతో సిద్దిపేటకు వస్తున్నాడు. రామునిపట్ల శివారులోకి రాగానే రోడ్డుపై గేదె అడ్డురావడంతో తప్పించబోయి అదుపుతప్పి లారీ బోల్తా పడింది. డ్రైవర్ రాకేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాకేశ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.