
ప్రతీసారి వందశాతం సాధించాలి
● విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే పురస్కారాలు
● తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యం
● ఎంపీ రఘునందన్‌రావు
మెదక్ కలెక్టరేట్: వచ్చేయేడు నుంచి ప్రతీసారి వందశాతం ఫలితాలతో విద్యారంగంలో మెతుకు సీమ సత్తా చాటాలని, విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇటీవలె వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, పాఠశాలల హెచ్‌ఎంలకు సన్మాన, పురస్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, డీఈఓ రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరంలో నూరు శాతం ఫలితాలు లక్ష్యంగా మెతుకు సీమ జిల్లా కీర్తిని విద్యారంగంలో చాటి చెప్పాలని ఎంపీ పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన విద్యార్థులను ఇంటర్‌లో చేరేలా కలెక్టర్ తీసుకుంటున్న చొరవ క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు అందిస్తాయని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా 12వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. 196 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించగా, 17 మంది 570 పైన మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన 196 మంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను, 82 మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్, ప్రత్యేక అధికారులకు సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం ఎంపీ రఘునందన్‌రావును ఘనంగా సన్మానించారు. సమావేశంలో అన్ని మండలాల ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, సంబంధిత సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.