హవేళిఘణాపూర్(మెదక్): రైతులు గతంలో మాదిరిగా ఎరువు పేడ, గొర్రె ఎరువు లాంటి వినియోగం తగ్గినందున వాటికి బదులుగా మినుము, జనుము, జిలుగ విత్తనాలను వేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ రైతువేదికలో మండలంలోని ఆయా గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు. మోతాదుకు మించి యూరియా వాడకం వల్ల చీడపీడలు సోకి రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులు దుక్కులు దున్ని పచ్చిరొట్టె, జిలుగు, మినుము చల్లి పార పెట్టినట్లయితే భూసారం పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్‌సింగ్, ఏడీఏ విజయనిర్మల, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీ మృతి
జహీరాబాద్ టౌన్: పని చేస్తున్న ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని రాయిపల్లి(డి) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కూ లీల కథనం మేరకు.. మండలంలోని రాయిపల్లి(డి) గ్రామానికి చెందిన ఎర్రోల కమలమ్మ(65)తోటి కూలీలతో కలిసి ఉదయం ఉపాధి పనులకు వెళ్లింది. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురై కింద పడిపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్, కూలీలు వెంటనే జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడి ఆచూకీ లభ్యం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం నర్సంపల్లి అటవీప్రాంతంలో ఆదివారం బయటపడ్డ గుర్తు తెలియని మృతుడి ఆచూకీ లభ్యమైంది. ఎస్‌ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఉల్వపాడు మండలం చాగళ్ల గ్రామానికి చెందిన తుల్లూరు వెంకయ్య(58) చేగుంట మండల కేంద్రంలో ఉండే తన కుమారుడి ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాడు. మానసిక పరిస్థితి బాగాలేని అతడు మార్చి 23న ఇంటి నుంచి కన్పించకుండా పోయాడు. అప్పటి నుంచి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం అటవీ ప్రాంతంలో మృతదేహమై కనిపించాడు. కుటుంబీకులను పిలిపించి చూయించగా మృతదేహాన్ని గుర్తించారు. మృతిపై ఎలాంటి అనుమానంలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మందుబాబులకు జరిమాన
సిద్దిపేటకమాన్: మద్యం తాగి పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల కిందట నిర్వహించిన వాహన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని సోమవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.34,500 జరిమాన విధించినట్లు తెలిపారు.
పటాన్‌చెరులో 27 మంది
పటాన్‌చెరు టౌన్: పటాన్ చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంకై న్ డ్రైవ్‌లో 27 మంది మద్యం తాగి పట్టుబడినట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపారు. వీరిని సోమవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా 9 మందికి రూ.1,500, 17 మందికి రూ.1,000 చొప్పున, మరో వ్యక్తికి రూ. 2 వేలు జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
మిరుదొడ్డి(దుబ్బాక): కారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ మహిళా కూలీలు గోప దేవవ్వ, బ్యాగరి చంద్రవ్వ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పీ.శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం మిరుదొడ్డిలో ఆయన మాట్లాడుతూ అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డి పేటలో ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న మహిళలను కారు ఢీకొట్టడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం రూ. 50 వేల చొప్పున కలెక్టర్ తన అత్యవసర నిధుల నుంచి చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 2 లక్షల బీమాను రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. సిద్దిపేట–మెదక్ జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల వద్ద తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.

యూరియా వినియోగం తగ్గించాలి : శాస్త్రవేత్త శోభ