
జాతరలో సునీతారెడ్డి పూజలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రాయిలాపూర్‌లో జరుగుతున్న శ్రీమల్లికార్జునస్వామి (మల్లన్న) జాతరలో ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాత, నిర్వాహకులు శామీర్‌పేట నర్సింగారావు దంపతుల ఆధ్వర్యంలో దేవతామూర్తులకు ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో నాగ్సాన్‌పల్లి మాజీ సర్పంచ్ ఎల్లం, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సార రామాగౌడ్, మాజీ ఎంపీటీసీ స్వప్న కిషోర్ గౌడ్, మొగులాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టొద్దు
బైరి నరేశ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు
గజ్వేల్‌రూరల్: నాసికత్వం పేరుతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టొద్దని మండల పరిధిలోని బెజుగామ గ్రామస్తులు, గ్రామ యువత పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం(ఎంఎన్‌ఎస్) వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు బైరి నరేశ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ యువత మాట్లాడుతూ.. దేవుళ్లను నమ్మవద్దంటూ ప్రజల్లో విద్వేశాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ తమల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. బైరి నరేశ్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా మారిపోయానని, ఎవరినీ ఇబ్బందులకు గురి చేసేందుకు రాలేదని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కుళ్లినస్థితిలో
మృతదేహం గుర్తింపు
చిన్నశంకరంపేట(మెదక్): కుళ్లిస్థితిలో మృతదేహం లభ్యమైన ఘటన నార్సింగి మండలం నర్సంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపల్లి గ్రామానికి చెందిన జెగ్గరి సత్యం మరికొందరు రైతులు కలిసి ఆదివారం అడవిలో తునికి ఆకును తెంపుతున్న క్రమంలో గుట్టరాళ్ల మధ్య మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బండరాళ్ల మధ్య మృతదేహం ఉండటంతో ఇన్ని రోజులు ఎవరూ గమనించలేదని తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపారు.
రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌కు సిద్దిపేట వేదిక
ఏపీఐ వైస్ చైర్మన్ డాక్టర్ గణేశ్ వెనిశెట్టి
సిద్దిపేటకమాన్: జనరల్ ఫిజీషియన్ వైద్యుల రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్‌కు సిద్దిపేట వేదిక కావడం తమకు గర్వకారణమని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) వైస్ చైర్మన్ డాక్టర్ గణేశ్ వెనిశెట్టి అన్నారు. సిద్దిపేట ఐఏంఏ హాల్‌లో జనరల్ ఫిజీషియన్ వైద్యుల రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలోని 200 మంది ప్రముఖ జనరల్ ఫిజీషియన్లు పాల్గొన్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స అందించాలి. సబ్జెక్ట్ అప్‌డేట్ చేసుకోవడం, చికిత్సలో నూతన టెక్నాలజీ వినియోగం అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ పెంటాచారి, జనరల్ సెక్రటరీ డాక్టర్ క్రాంతికుమార్, డాక్టర్ గణేశ్, డాక్టర్ ఫణిందర్ తదితరులు పాల్గొన్నారు.