
హక్కుల కోసం పోరాడేది ‘సీపీఐ’
బెజ్జంకి(సిద్దిపేట): కార్మికుల, కూలీల హక్కుల సాధన కోసం పోరాడేది సీపీఐ పార్టీయేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బెజ్జంకిలో సీపీఐ మండల 13వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన సీపీఐ నాయకులకు, పహల్గామ్ మృతులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పా టించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధి హామీలాంటి అనేక చట్టాలను అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించామన్నారు. కేంద్రం కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ పేదలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, తదితర సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఇవ్వాలని సూచించారు. దేశమంతా ముక్త కంఠంతో పార్టీలకతీతంగా ఆపరేషన్ సిందూర్‌కు అండగా ఉంటుందన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, కార్మికుల హక్కులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా 20న ఏఐటీయూసీ నిర్వహించే సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్‌రెడ్డి, శంకర్, మండల కార్యదర్శి రూపేశ్, మధు, మహేశ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి