
బట్టీలుపెట్టి.. పన్నులు ఎగ్గొట్టి
● పన్ను కట్టని వ్యాపారులు ● గ్రామ పంచాయతీల ఆదాయానికి గండి ● ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు ● నిబంధనలున్నా పట్టించుకోని వైనం
మండల శివారులో వెలసిన ఇటుక బట్టి
పటాన్‌చెరు టౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణంలో, మండల పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ఇటుకతో చేస్తున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకుని మండలంలో ఆయా గ్రామ పంచాయతీల్లో వ్యాపారులు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా నెలకొల్పారు. ప్రతీ ఏడాది రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా వీటి నిర్వాహకులు ఆయా పంచాయతీలకు ఎటువంటి పన్ను కట్టడం లేదు. వ్యాపారంలో 2% పన్ను చెల్లించాలని నిబంధన ఉన్నా సదరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పటాన్‌చెరు మండల పరిధిలోని రామేశ్వరంబండ, ఇంద్రేశం, ఐనోల్, చిన్న కంజర్ల గ్రామాలతో పాటు నియోజకవర్గ పరిధిలో ఆయా గ్రామాల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లాగా వెలిశాయి. ఆయా గ్రామ పంచయతీ శివారుల్లో సుమారు పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. ప్రతీ బట్టీలోనూ ఇటుకలను కాల్చి వాటి క్వాలిటీని బట్టి ఒక్కొక్కటి రూ.7 నుంచి రూ.11 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఒక యాజమాని కనీసం వేసవి సీజన్‌లో 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇటుకలను విక్రయిస్తారు. వీటి ద్వారా లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. వీటి యాజమానులు పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు. ఇందుకు కారణం విక్రయ సమయంలో ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడమేనని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన రెండు శాతం పన్నులు చెల్లించడం లేదు. పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో 2 శాతం పంచయతీ ఖాతాల్లో కచ్చితంగా జమ చేయల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలుదారులు డబ్బులు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి భారీ గండి పడుతుంది. పంచాయతీల అనుమతి తీసుకోవాలనే నిబంధనలున్నా వాటిని పట్టుంచుకోవడం లేదు.
ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు
ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు భూ–పరిరక్షణ చట్టం 123/12 పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే ఇటుక బట్టీలను నిర్వహించాలి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పచ్చని పంటలు పండే భూముల్లో ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అనుమతి తప్పనిసరి
మండల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలకు గ్రామ పంచాయతీల నుండి ట్రేడ్ అనుమతి తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో విచారణ చేపడుతాం. విచారణ చేపట్టిన తరువాత ట్రేడ్ అనుమతులు లేకుండా నడిపే ఇటుక బట్టీల యజమాన్యులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం.
హరిశంకర్ గౌడ్,
మండల పంచాయతీ అధికారి

బట్టీలుపెట్టి.. పన్నులు ఎగ్గొట్టి