
సంగారెడ్డి రోడ్లకు మహర్దశ
● మంజూరైన నిధులు ● త్వరలో శంకుస్థాపనలు
సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. సంగారెడ్డి పట్టణంలోని 4 రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ విభాగం, హెచ్‌ఎండీఏల నుంచి మొత్తంగా సంగారెడ్డి రోడ్లకు రూ.83.94కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలోని ఐటీఐ నుంచి గొల్లగూడెం వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం, నటరాజ్ థియేటర్ నుంచి కల్వకుంట మీదుగా ఐఐటీ వరకు 80 ఫీట్ల రోడ్ల నిర్మాణం, రుక్మిణి థియేటర్ నుంచి చింతలపల్లి కిష్టయ్య గూడెం, రాజంపేట నుంచి డీఎస్పీ కార్యాలయం మీదుగా మల్కాపూర్ చింతల వరకు మరో రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పట్టణంలో రద్దీగా ఉండే బైపాస్ రోడ్డును సెంటర్ లైటింగ్స్ డివైడర్ ఏర్పాటు కోసం రూ.12 కోట్లతో నేషనల్ హైవే అథారిటీకి అప్పగించి టెండర్ ప్రక్రియలో ఉంది. అలాగే సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి రైతు వేదిక పక్క నుంచి రూ.4 కోట్లతో బీటీ రోడ్డును కలివేముల నుంచి ఓడీఎఫ్ రోడ్డుకు అనుసంధానం చేసే మరో రోడ్డుకు నిధులు మంజూరైన సంగతి తెలిసిందే. ఇక పట్టణంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధి కోసం రూ.12 కోట్లతోపాటు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్,హెచ్‌ఎండీఏల నుంచి విడివిడిగా కూడా నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే ఈ పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించనున్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
గత పదేళ్లలో చేయని అభివద్ధిని ప్రస్తుతం చేపడుతున్నాం. రాబోయే మూడేళ్లలో సంగారెడ్డి ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం.
– నిర్మలారెడ్డి,
టీజీఐఐసీ చైర్మన్