జొన్న, ఆలు రైతులకు నిరాశ | - | Sakshi
Sakshi News home page

జొన్న, ఆలు రైతులకు నిరాశ

May 11 2025 12:22 PM | Updated on May 11 2025 12:22 PM

జొన్న, ఆలు రైతులకు నిరాశ

జొన్న, ఆలు రైతులకు నిరాశ

● ఈసారి కూడా పెరగని పంట రుణాల స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ● వరికి నామమాత్రంగా రూ.వెయ్యి పెంపు ● పెరిగిన సాగు వ్యయానికి తగ్గట్టు పెంచలేదంటున్న రైతులు ● జిల్లా బ్యాంకులకు అందిన ఆదేశాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంట రుణాల మంజూరులో కీలకమైన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ విషయంలో జొన్న, సోయాబీన్‌ వంటి పంటలు సాగు చేసే రైతులకు ఈసారి నిరాశే ఎదురవుతోంది. వరి, మొక్కజొన్న వంటి పంటల సాగుకు ఇచ్చే పంట రుణాల స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఈ ఏడాది స్వల్పంగా పెంచినప్పటికీ...జొన్న, సోయా, ఆలు వంటి పంటలు సాగు చేసే రైతులకు మాత్రం పెంచలేదు.

ఈ ఏడాది కూడా అంతేమొత్తంలో...

గత ఆర్థిక ఏడాది 2024–25లో జొన్నకు బ్యాంకర్లు ఎకరానికి రూ.19 వేలు ఇచ్చే వారు. ఈసారి కూడా అంతే మొత్తంలో పంట రుణం ఇవ్వనున్నారు. అలాగే సోయా రైతులకు గత ఆర్థిక ఏడాదిలో ఇచ్చి న మాదిరిగానే ఈసారి కూడా ఎకరానికి రూ.30 వేల చొప్పున రుణం ఇవ్వనున్నారు. ఉద్యానవన పంటల్లో ఒకటైన ఆలుగడ్డను కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ పంటకు కూడా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెరగలేదు. ఎకరాకు రూ.50 వేలకే పరిమితం చేశారు. ఈ ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఆయా పంటల సాగు చేసే రైతులకు బ్యాంకర్లు ఇచ్చే పంట రుణాలకు సంబంధించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు చేస్తూ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు నుంచి జిల్లాలోని బ్యాంకులకు ఆదేశాలందాయి.

సాగు వ్యయం పెరిగిన జొన్న, సోయా పంటలు

అన్ని పంటల మాదిరిగానే జొన్న, సోయా పంటల కూడా సాగు వ్యయం భారీగా పెరిగింది. కూలీల ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరలు ప్రతి ఏటా పెరుగుతూనే వస్తున్నాయి. ఆలు గడ్డకు విత్తన భారమే అధికంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఆలు విత్తనాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ పంటల పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది. కానీ, ఈ పెట్టుబడికి తగ్గట్టుగా పంట రుణానికి సంబంధించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పెంచకపోవడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు.

ఉద్యాన వన పంటలకు...

ఉద్యానవన పంటల సాగుకు జిల్లాలో ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా అల్లంను సాగు కూడా ఉంటుంది. ఈ అల్లం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎకరాకు రూ.67 వేల నుంచి రూ.71వేలకు పెరిగింది. అయితే అల్లంకు విత్తన ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ విత్తనాల కోసం రైతులు రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మామిడి పంటకు ఎకరాకు రూ.44 వేల నుంచి రూ.47 వేలకు పెరిగింది. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను నామమాత్రంగా పెంచడం పట్ల రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల పెట్టుబడులకు తగ్గట్టుగా ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

వరికి రూ. వెయ్యి పెంపు

జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పరిశీలిస్తే...వరి సాగుకు ఎకరానికి ఇచ్చే పంట రుణం రూ.వెయి మాత్రమే పెరిగింది. 2024–25లో ఈ పంటకు ఎకరానికి రూ. 45 వేలు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 46 వేలకు పెంచారు. నామమాత్రంగా ఈ పెంపు ఉండటం పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. మొక్కజొన్న స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ రూ.28,000ల నుంచి రూ. 30,000లకు పెరిగింది. పత్తికి రూ. 46,000 నుంచి రూ. 48,000లకు పెంచారు. కందికి రూ.21 వేల నుంచి రూ. 22 వేలకు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement