
నేరస్తుల్ని విధిగా శిక్షించాలి
సంగారెడ్డి జోన్: నేరం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కోర్టు డ్యూటీ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. న్యాయస్థానం ముందు నిందితులకు శిక్ష పడినప్పుడే, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకోవడానికి వీలున్న కేసులలో రాజీ కుదుర్చుకునేలా చూడాలని సూచించారు. అనంతరం షీటీం బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ...పాఠశాలలు, కళాశాలు, బస్ స్టాండ్ తదితర రద్దీ ప్రాంతాలలో షీటీంలు నిఘా ఉంచాలన్నారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన జిల్లా షీటీం నంబర్ 8712656772కు కాల్ చేసి గానీ, వాట్సాప్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.శ్రీనివాస్‌రావ్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రమేశ్, కోర్ట్ లైజనింగ్ అధికారి సత్యనారాయణ, డీసీఆర్బీ సిబ్బంది, కోర్ట్ డ్యూటీ అధికారులు తదితరులున్నారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్