
24 రోజులైనా గింజ కొనలే
మబ్బులు కమ్ముతుండటంతో రైతుల్లో ఆందోళన
వట్‌పల్లి(అందోల్): యాసంగి సీజన్‌లో వరి పండించడం కన్నా ధాన్యాన్ని అమ్ముకోవడానికే రైతులు కష్టపడాల్సి వస్తోంది. మండల పరిధిలోని బిజలీపూర్, కేరూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనుగోళ్లను మాత్రం మరిచిపోయారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగానే రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించి 15 రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టారు. వ్యవసాయాధికారులు కూడా వచ్చి ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించినప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియ మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పది రోజులుగా మబ్బులు కమ్ముకుంటుండటంతో వర్షం పడితే ధాన్యం తడిచిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు వెంటనే కూలీలను రప్పించి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఐకేపీ సీసీ జనార్ధన్‌ను వివరణ కోరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభానికి ముందే బిహార్ హమాలీలను మాట్లాడగా వారు వారం రోజులుగా వస్తున్నామని చెప్పి మోసం చేస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదని వివరణ ఇచ్చారు. వేరే హమాలీలను రపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.