
శుభకార్యానికి వస్తూ..
● టీవీఎస్ మోపెడ్ అదుపుతప్పి..
● అక్కడికక్కడే వృద్ధుడు మృతి
వర్గల్(గజ్వేల్): బంధువుల ఇంట్లో శుభకార్యానికి వస్తూ టీవీఎస్ మోపెడ్ అదుపుతప్పి కింద పడిపోయి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వర్గల్ మండలం మాదారం–గిర్మాపూర్ గ్రామాల మధ్యలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు.. మెదక్ జిల్లా దొంతి గ్రామానికి చెందిన దేవోల్ల పోచయ్య(70) టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ వాహనంపై వర్గల్ మండలం గిర్మాపూర్‌లో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు వస్తున్నాడు. మాదారం–గిర్మాపూర్ మధ్య మలుపులో వాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్యానికి బానిసై ఉద్యోగి ..
బెజ్జంకి(సిద్దిపేట) : మద్యానికి బానిసై ఉద్యోగి మృతి చెందిన ఘటన బెజ్జంకిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రానికి చెందిన న్యాత మల్లేశం(50) అక్కడే ఎంఆర్‌ఓ కార్యాలయంలో రికార్డు అసిసెంట్‌గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి బెజ్జంకిలో నివసిస్తున్నాడు. మల్లేశం కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం తాగి బైక్‌పై ఇంటికొచ్చాడు. లోపలికి వస్తూనే మత్తులో కిందపడి అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికి వాంతులు, విరోచనాలు చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నుట్లు ఏఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు.