
పంట రుణం
రూ.3,404 కోట్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈ ఖరీఫ్, రబీ పంట సీజన్లలో రైతులకు రూ.3,404 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తం 2.93 లక్షల మందికి ఈ రుణాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు 2025–26 ఆర్థిక ఏడాదికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఇటీవల ఖరారైంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కూడా ఈ ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. గత ఆర్థిక ఏడాదికంటే ఈసారి సుమారు 14.5% అధికంగా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, వ్యవసాయ టర్మ్‌లోన్ల, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చే రుణాలు రుణాలు ఇలా అన్నీ కలిపితే మొత్తం 3.13 లక్షల మంది రైతులకు రూ.6,721.87 కోట్ల వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాలు ఇవ్వలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతేడాది 88 శాతమే రుణాలు..
గత ఆర్థిక సంవత్సరం 2024–25లో రూ.3,328.19 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ బ్యాంకర్లు కేవలం రూ.2,942 కోట్లు మాత్రమే పంట రుణాలను ఇచ్చారు. అంటే నిర్దేశిత లక్ష్యంలో కేవలం 88.41% మాత్రమే ఈ రుణాలను ఇవ్వగలిగారు. ఈసారి ఈ రుణ లక్ష్యాన్ని 14.5% పెంచినప్పటికీ...బ్యాంకులు ఏ మేరకు రుణాలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మరో నెల రోజుల్లో ఖరీఫ్ పంటల సీజను ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి కోసం డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు వెంటనే ఈ రుణ మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తే రైతులకు సకాలంలో పెట్టుబడులకు డబ్బులు అందుతాయనే అభిప్రాయం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.
త్వరలో డీసీసీ సమావేశం..
డీసీసీ (డిస్టిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ) త్వరలో సమావేశం నిర్వహించి ఖరారైన ఈ వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించనున్నారు. ఈ మేరకు త్వరలో ఈ కమిటీ సమావేశం నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, కో ఆపరేటివ్ రంగంలోని బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొనున్నారు.
ఈసారి 2.93 లక్షల మంది రైతులకు ఇవ్వాలని నిర్ణయం గతేడాదికంటే 14.5% అధికంగా లక్ష్యం ఖరారైన 2025–26 వార్షికరుణ ప్రణాళిక త్వరలో డీసీసీ సమావేశంలో ప్రకటన
రైతులకు ప్రభుత్వం తీపి కబురునందించనుంది. ఈసారి వారికి పంటరుణాలకు గతేడాదికంటే 14.5% అధికంగా ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే డీసీసీ సమావేశంలో ఇందుకు సంబంధించి ప్రకటించనున్నారు. త్వరలో ప్రకటించనున్న నిర్ణయంతో జిల్లాలో 2.93 లక్షల మంది రైతులకు పంట రుణాలు అందనున్నాయి. మరి బ్యాంకర్లు రుణాల మంజూరులో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.
గృహ రుణాలకు మాత్రం భిన్నంగా..
రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించే బ్యాంకర్లు గృహ రుణాలకు మాత్రం గతేడాది విరివిగా మంజూరు చేశారు. ఈ హౌసింగ్ లోన్లకు నిర్దేశించిన లక్ష్యం కంటే రెట్టింపు స్థాయిలో ఈ రుణాలిచ్చారు. పంట రుణాల విషయంలో నిర్దేశించిన లక్ష్యంలో 88% మాత్రమే రుణాలిస్తే..ఈ హౌసింగ్ రుణాలు మాత్రం ఏకంగా 207% రుణాలిచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈసారైనా బ్యాంకర్లు కొర్రీలు పెట్టకుండా అన్నదాతలకు పంట రుణాలు సకాలంలో మంజూరు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.