
నిలువ నీడలేదు.. నీళ్లూ లేవు
హత్నూర (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తాగు నీళ్లు లేవు. ఎండలు దంచుతున్న కూలీలకు కనీసం నీడ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఉపాధి కూలీలు నీళ్లు లేక నీడ లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు ఉపాధి కూలీలకు పని వద్ద తాగునీటితోపాటు నీడను ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. హత్నూర మండలంలో 38 గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో 13 వేలమంది ఉపాధి హామీ పథకం కూలీలు పేర్లు నమోదు చేసుకోగా ఎండవేడికి తట్టుకోలేక ప్రస్తుతం 2,500 నుంచి 3000 మంది ఉపాధి కూలీలు మాత్రమే గ్రామాలలో పనిచేస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో సుమారు 60మంది కూలీలు మాత్రమే పనికి వస్తున్నారు.
టెంట్లు ఎక్కడ?
ఉపాధి హామీ పనుల వద్ద కూలీల కోసం తాగునీరు ఏర్పాటు చేయాలి. కూలీలకు కొంత సమయం సేద తీరేందుకు టెంట్లను ఏర్పాటు చేసి నీడ కల్పించాలి. కానీ, ఎక్కడ కూడా తాగునీరు టెంట్లు ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబ పోషణ భారమై తప్పని పరిస్థితుల్లో ఉపాధి కూలీలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని కూలీలు వాపోతున్నారు. ఎండల తీవ్రతను తట్టుకోలేక ఉపాధి కూలీలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికై నా ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు తాగునీటి సౌకర్యంతోపాటు నీడను ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ఉపాధి కూలీలు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఉపాధి కూలీల అవస్థలు
పట్టించుకోని అధికారులు
ఎండ తీవ్రతకు అల్లాడుతున్న కూలీలు
ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం
ఉపాధి హామీ పథకం పనిచేసే వద్ద కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాం. నీళ్లు ఏర్పాటు చేస్తే ఎండకు వేడిగా అయిపోతున్నాయి అందుకే పెట్టడం లేదు. రోజు ఒక దగ్గర పనిచేస్తున్నారు. అందుకోసమే టెంట్లు ఏర్పాటు చేయలేదు. – ప్రవీణ్ కుమార్, ఏపీఓ

నిలువ నీడలేదు.. నీళ్లూ లేవు