
ప్రవేశాలకు వేళాయె..
కేజీబీవీల్లో ప్రవేశాలు షురూ
● ఆంగ్ల మాధ్యమంలో బోధన
● ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం
● జిల్లాలో 22 పాఠశాలలు
దుబ్బాకటౌన్: పేద, వెనుకబడిన, మధ్యలో బడి మానేసిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్భాగాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. విద్యార్థులలో నైపుణ్యాలను మెరుగుపరిచి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కస్తూర్భా పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 24 నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఆరో తరగతిలో..
జిల్లాలో మొత్తం 22 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి తరగతిలో 40 మంది చొప్పున విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏమైనా ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు తీసుకుంటున్నారు.
ఆంగ్ల మాధ్యమంలో బోధన
విద్యార్థినులకు అన్ని రకాల వసతులు, మెనూ ప్రకారం ఆహారం, నాణ్యమైన విద్య, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు వసతితో కూడిన విద్య అందిస్తుండటంతో ఈ పాఠశాలలు నిరుపేద కుటుంబాల బాలికలకు ఎంతో ఆసరగా నిలుస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతోపాటు నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నారు. భవిష్యత్‌లో విద్యార్థులకు ఉపాఽధి అవకాశాలు పొందేలా కుట్లు, అల్లికలతో పాటు ఇతర అంఽశాలను నేర్పిస్తున్నారు. వివిధ రకాల వృత్తి విద్య కోర్సులు సైతం అమలు చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యతతో కూడిన విద్య, వసతి గృహం అందుబాటులో ఉన్నందున గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్‌లో విద్యార్థినులకు ఉపాధి కల్పించేలా వృత్తి విద్య కోర్సులు, కుట్లు ,అల్లికలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ వారికి భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
– స్వాతి, దుబ్బాక కేజీబీవీ పాఠశాల,
ప్రత్యేక అధికారి
దరఖాస్తు ఇలా..
కస్తూర్భా విద్యాలయాల్లో ప్రవేశాలకు మొదట తల్లిదండ్రులు లేని విద్యార్థినులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తర్వాత మిగిలిన విద్యార్థినులకు ప్రవేశాల కోసం నమోదు చేసుకుంటున్నారు. ప్రవేశాలకు విద్యార్థులు 5వ తరగతి వరకు చదువుకున్న బోనోపైడ్, టీసీ, ఆధార్‌కార్డు జిరాక్స్, ఫొటోలు జత చేయాలి.

ప్రవేశాలకు వేళాయె..