
ఏఐతో పంట తెగుళ్ల గుర్తింపు
ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్‌లర్
ములుగు(గజ్వేల్): కృత్రిమ మేథ(ఏఐ), రోబోటిక్స్, డ్రోన్‌ల ఏకీకరణ ద్వారా పంట దిగుబడి, తెగుళ్లు, వ్యాధుల అంచనా వేయవచ్చని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు ములుగు ఉద్యాన వర్సిటీలో గురువారం హైదరాబాద్‌కు చెందిన మారుత్ డ్రోన్స్ సంస్థతో ఉద్యాన పంటలపై పరిశోధన, అభివృద్ధి, శిక్షణలో సహకారం పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యానవన ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతున్నదని తెలిపారు. డ్రోన్ ఆధారిత సాంకేతికత సామర్థ్యాన్ని ఉపయోగించి పంట పర్యవేక్షణ, తెగులు, వ్యాధుల అంచనా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మెరుగు పరచడం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు ప్రధాన ఉద్యాన పంటలు మిర్చి , పసుపు, టమోటా, వంకాయ, ఆయిల్‌పామ్, మామిడి పరిశోధన శిక్షణ కార్యక్రమాలు సాంకేతిక అభివృద్ధిపై సంయుక్తంగా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో మారుత్ డ్రోన్ కో ఫౌండర్ ప్రేమ్ కుమార్, ఉద్యానవర్సిటీ అధికారులు భగవాన్, చీనా నాయక్, లక్ష్మినారాయణ, సురేశ్‌కుమార్, శ్రీనివాసన్, వీణాజ్యోతి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.