
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు బలవన్మరణం
ఉమ్మడి జిల్లాలో అప్పుల బాధతో వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
సిద్దిపేటకమాన్: ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన పెద్దెల్లి తానేష్ (40) జీవనోపాధి నిమిత్తం సిద్దిపేటకు వచ్చి హనుమాన్‌నగర్‌లో అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. తానేష్‌కు ఎటువంటి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై కుటుంబ పోషణ భారమైంది. అప్పులు చేసి తీర్చే మార్గం లేక గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి..
హవేళిఘణాపూర్(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో సతమతమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్‌ఐ రాజు కథనం ప్రకారం... మండల పరిధిలోని పల్ల సావిత్రి, యాదగిరి ప్రథమ కుమారుడు మనోహర్(23) కిరాణం కొట్టుపెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. దీంతో కుటుంబ పోషణతో పాటు వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పులు పేరుకుపోయాయి. దీంతో ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై బుధవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని తన తమ్ముడు దుర్గాప్రసాద్‌కు తెలుపగా వెంటనే మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి గాంధీ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.