
విచక్షణ రహిత జర్నలిజాన్ని ప్రోత్సహించొద్దు
సీనియర్ సంపాదకులు కే. శ్రీనివాస్
ములుగు(గజ్వేల్) : సోషల్ మీడియాలో జవాబుదారీతనం లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, రాజకీయ నాయకులు విచక్షణ రహిత జర్నలిజాన్ని ప్రోత్సహించొద్దని సీనియర్ సంపాదకులు, రచయిత కే. శ్రీనివాస్ పేర్కొన్నారు. గజ్వేల్ ప్రెస్‌క్లబ్ 25 ఏళ్ల వేడుకల(రజతోత్సవాలు) సందర్భంగా ములుగులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కే.విరాహత్ అలీతో కలిసి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ప్రింట్ జర్నలిజంలో వడపోత ప్రక్రియ ఉండేదని, ప్రస్తుతం ఎవరికి నచ్చినట్లు వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ మాట్లాడుతూ.. అక్షరజ్ఞానం లేనివారు, అల్లరి మూకలు మీడియా పేరు చప్పుకొని ఇష్టారీతిన బ్లాక్ మైలింగ్‌కు పాల్పడుతున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి వారికి ప్రజా కోర్టులోనే గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ఎల్లం, టీ. నర్సింలు, జగదీశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ విజయమోహన్, తదితరులు పాల్గొన్నారు.