వరి కోత యంత్రం దహనం
కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వ్యక్తులు వరి కోత యంత్రంకు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలోని మంగోల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లగిశెట్టి వెంకటేశం, ఎస్డీ జహీర్ కలిసి కొన్నేళ్ల కిందట అప్పులు చేసి వరి కోత యంత్రంను కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి వరకు మద్దూరి నారాయణరెడ్డి వరి పంటను కోసి సమీపంలో మరి కొందరి రైతుల పంటను కోసేది ఉండటంతో యంత్రంను నారాయణరెడ్డి బావి వద్దే ఉంచారు. మరుసటి రోజు వెళ్లే సరికి యంత్రం పూర్తిగా కాలిపోయి ఉంది. వ్యవసాయ బావి యజమానికి, గ్రామస్తులకు సమాచారం అందించారు. వరి కోత యంత్రంను దహనం చేసేందుకు డిజిల్ ట్యాంకరుపై ఎండుగడ్డిని వేసి నిప్పంటించగా డిజిల్ ట్యాంక్ పేలి కాలిపోయినట్లుగా నిర్ధారించారు. సుమారు రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ విషయమై కుకునూరుపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు.


