
ఆర్టీసీకి జవసత్వాలు!
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం
జహీరాబాద్ టౌన్: ఆర్టీసీలో డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. శాశ్వత నియామకాల ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు డ్రైవర్ల సమస్యను అధిగమించి ఆర్టీసీని బలోపేతంతో చేసే చర్యలకు సంస్థ ఉపక్రమించింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున్న రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం చేపట్టి వారికి శిక్షణనిస్తున్నారు. త్వరలో వీరంతా విధుల్లో చేరనున్నారు.
నియామకాలు నిలిచిపోవడంతోనే...
ఆర్టీసీలో చాలాకాలంగా నియామకాలు లేకపోవడంతో క్రమంగా డ్రైవర్ల కొరత పెరుగుతూ వచ్చింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉన్న వారిపై పనిభారం పెరిగిపోతోంది. డ్రైవర్ల కొరత కారణంగా సకాలంలో బస్సులు నడవక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు బస్సు సర్వీసులు రద్దు కూడా అవుతున్నాయి. వేసవిలో రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో కొత్త డ్రైవర్లు వస్తే కొంత సమస్య తొలగిపోనుంది.
కాంట్రాక్టు పద్ధతిలో నియామకం
ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి, ఖేడ్,మెదక్, సిద్దిపేట, ప్రజ్ఞాపూర్ డిపోలు ఉండగా మొత్తం 585 బస్సులున్నా యి. మెదక్ రీజియన్‌లో 119 మంది డ్రైవర్‌ల అవసరం ఉంది. ఇప్పటికే 70 మందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో భర్తీ చేయనున్నా రు. భారీ వాహనాల డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి డ్రైవర్లకు 3 నెలలపాటు శిక్షణనిస్తున్నారు. వీరికి నెలకు జీతం రూ.22 వేలు చెల్లించనున్నారు.