
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ఘటనా స్థలంలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నర్సాపూర్ – సంగారెడ్డి రహదారిలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై లింగం కథనం మేరకు... సంగారెడ్డి జిల్లా చౌటకురు మండల కేంద్రానికి చెందిన ఎల్లపోల్ల బాలరాజ్ (32) సొంత పనిపై హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్లి తిరిగి నర్సాపూర్ మీదుగా స్వగ్రామానికి వస్తున్నాడు. నర్సాపూర్‌కు చెందిన చింతకుంట నవీన్ (26) బైక్‌పై సంగారెడ్డి వైపు నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వస్తూ ఎదురుగా వస్తున్న బాలరాజు బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బాల్‌రాజు అక్కడికక్కడే మృతి చెందగా నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు నవీన్‌ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మృతి చెందాడు. బాలరాజ్ భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలరాజుకు భార్య, పిల్లలు ఉన్నారు.
మరో ఘటనలో వ్యక్తి..
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పులిమామిడి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం దొంగల ధార్మరం గ్రామానికి చెందిన గఫార్(40) దౌల్తాబాద్‌కు బైకుపై డీజిల్ తీసుకురావడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో గాయపడిన అతడిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం