ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై.. | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై..

Apr 25 2025 11:33 AM | Updated on Apr 25 2025 11:52 AM

ఆర్థి

ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై..

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.

సిద్దిపేటకమాన్‌: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణం రాంనగర్‌కు చెందిన మండల నరేశ్‌(32) కొన్నేళ్లుగా అస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకునే అతడికి ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మనస్తాపానికి గురై పట్టణ శివారు ఎర్ర చెరువు కట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు అతడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి..

నర్సాపూర్‌ రూరల్‌: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై లింగం కథనం ప్రకారం... నర్సాపూర్‌ మండలం ఎల్లారెడ్డి గూడ గిరిజన తండాకు చెందిన నేనావత్‌ జాంగిర్‌ నాయక్‌ (35) తనకు ఉన్న 20 గుంటల భూమితో పాటు ఇతరుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మతిస్థిమితం లేని వివాహిత..

కొండపాక(గజ్వేల్‌): మతిస్థిమితం లేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్‌ సీఐ.విద్యాసాగర్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సిర్సనగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మి (56)కి కొన్ని నెలలుగా మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతుకుతున్న క్రమంలో ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా భూమి హద్దు కోసం పాతిన ఎత్తైన గనేట్‌ రాయికి ఉరేసుకొని చనిపోయింది. మృతురాలికి భర్త, కొడుకు, కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులబాధతో యువకుడు..

తొగుట(దుబ్బాక): అప్పుల బాధతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఎల్లారెడ్డిసేటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మన్నె భాస్కర్‌ (29) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు ఏళ్ల క్రితం భార్య మహేశ్వరి మృతి చెందింది. తీవ్ర మనోవేదనకు గురై పనికి వెళ్లకుండా ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటిపై ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో రూ 3.25లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకురావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత..

జిన్నారం (పటాన్‌చెరు): అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కానుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్‌ రెడ్డి వివరాల ప్రకారం... మెదక్‌ జిల్లా రామయంపేటకు చెందిన రేష్మాబేగంను (30) కానుకుంట గ్రామానికి చెందిన ఎండి అహ్మద్‌ 2019లో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త అహ్మద్‌, అత్త భాను, బావ సలీం, చిన్న మామ పాషాలు కలిసి అదనపు కట్నం తీసుకురావాలని రేష్మ భేగంను మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో ఈనెల 16న పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోమారు గొడవపడటంతో 22వ తేదీన పెద్దల సమక్షంలో మాట్లాడి ఒప్పించారు. దీంతో అత్తారింటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరు కొడుకుల మణికట్టుపై గాయపరిచి రేష్మా బేగం బెడ్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోఉన్న ఇద్దరి పిల్లలను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అత్తింటి వేధింపులతోనే మృతి చెందిందని సోదరుడు సల్మాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై.. 1
1/2

ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై..

ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై.. 2
2/2

ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement