
నిద్రిస్తున్న యువకుడి పైనుంచి..
మర్కూక్(గజ్వేల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ యువకుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మర్కూక్ మండలంలోని కర్కపట్ల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ దామోదర్ వివరాల ప్రకారం... కర్కపట్ల గ్రామానికి చెందిన కరుణాకర్ (24) అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ తన టిప్పర్ల ద్వారా ప్రతి రోజు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో గ్రామంలో నుంచి మట్టిని హైదరాబాద్‌కు తలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 12గంటల తర్వాత మూడు టిప్పర్లు, 2 జేసీబీల సహాయంతో కర్కపట్ల గ్రామానికి చెందిన గ్యార మల్లేశం ప్రభుత్వ భూమి నుంచి మట్టిని తరలిస్తున్నాడు. తన వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్న కరుణాకర్ నిద్రరావడంతో కొద్దిసేపు పడుకుంటానని చెప్పి వెళ్లి పక్కన నిద్రిస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతో అజాగ్రత్తగా అతడి ఛాతీపై నుంచి టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కరుణాకర్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేన్నారు.
రేణికుంట రోడ్డు ప్రమాదంలో...
బెజ్జంకి(సిద్దిపేట): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట వద్ద గల రాజీవ్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బెజ్జంకి క్రాసింగ్‌కు చెందిన బి.నక్షత్రమ్మ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో బెజ్జంకిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్షత్రమ్మ భర్త ఆనందరెడ్డికి తీవ్ర గాయాలు కాగా, హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కొలిపాక మంజుల, బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఐలేని నవీన్‌రెడ్డిలకు కాలు ఫ్యాక్చరైంది. వీరు కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.