
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
రాయికోడ్(అందోల్): మండలంలోని యూసుఫ్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన వేడుక గురువారం వైభవంగా జరిగింది. బీచ్‌కుందకు చెందిన శివాచార్య సోమలింగ స్వామి ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, నంది, గణపతి, సుబ్రమణ్య స్వామి, శిఖరప్రతిష్ఠలు వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ధనసిరి ఆశ్రమాధిపతి, బండయప్ప స్వామి, నిర్వాహకులు భాస్కర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సంగారెడ్డి, నాయకులు నవనీత తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు
ప్రాధాన్యతనివ్వాలి
జహీరాబాద్ టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొనింటి నర్సింలు కోరారు. ఈ మేరకు గురువారం ఆర్డీఓ రాంరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇళ్లులేని వారికి స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేయాలన్నారు. శ్రమశక్తి సంఘాలు ఏర్పాటుచేసి జాబ్‌కార్డు ఇచ్చి 150 రోజుల పని కల్పించాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద 5% యూనిట్స్ కేటాయించాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో రాజ్‌కుమార్, నాయకులు మచ్చెందర్, బిస్మిల్లా,శోభమ్మ, వాజీద్‌లు ఉన్నారు.
శాంతిభద్రతలపై
రాజీపడేది లేదు: ఎస్పీ
పటాన్‌చెరు టౌన్: శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్పీ సందర్శించి పెండింగ్ కేసులు విషయంలో పలు సూచనలు చేశారు. అనంతరం పటాన్‌చెరు మైనార్టీ నాయకులు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. జిన్నారంలో ఓ వర్గానికి చెందిన విద్యార్థులపై అకారణంగా జరిగిన దాడిపై సంపూర్ణ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడుతూ కోతులు విగ్రహంను ధ్వంసం చేశాయని దర్యాప్తులో గుర్తించి ఆధారాలతో సహా చూపి అందరిలో ఉన్న అపోహలను తొలగించారని తెలిపారు.
నేడు న్యాల్‌కల్‌లో
భూ భారతి సదస్సు
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల కేంద్రమైన న్యాల్‌కల్‌లో భూభారతి–2025 చట్టంపై శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు ఉండనుందని తహసీల్దార్ భూపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆర్‌డీఓ రాంరెడ్డి, న్యాల్‌కల్, హద్నూర్ పీఏసీఎస్ చైర్మన్లు సిద్దిలింగయ్యస్వామి, జగనాథ్‌రెడ్డి, ఎంపీడీఓ రాజశేఖర్‌తోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు హజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి రైతులందరూ హాజరు కావాలని తహసీల్దార్ కోరారు.
డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం
పటాన్‌చెరు టౌన్: డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు. మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు పెద్దకంజర్లలో అడ్మిషన్ తీసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు గురుకుల నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్ కల్పించనున్నట్లు చెప్పారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, విద్య, యూనిఫాం, ఉచిత ఎగ్జామినేషన్ ఫీజు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94948 24692, 80080 70959 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన