
ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పటాన్‌చెరువు మండలం ఇస్నాపూర్‌లో నివాసముంటున్న వీ. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. వెంకట్రావు సోమవారం భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్‌లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు మొత్తం అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొనిల దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివతేజ తెలిపారు.