అతి పెద్ద జైన విగ్రహాన్ని కాపాడాలి
నంగునూరు(సిద్దిపేట): నంగునూరులోని చిన్న కొండపై వేల ఏళ్ల కింద వెలసిన వర్ధమాన మహావీరుడి విగ్రహం వద్ద క్వారీ పనులను ఆపి విగ్రహం ధ్వంసం కాకుండా చూడాలని పురావస్తు పరిశోధకుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరులోని జాకీరమ్మ బండపై ఉన్న జైన శిల్పం గురించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ శివనాగిరెడ్డికి వివరించడంతో బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు బండలను తొలుస్తున్న క్రమంలో విగ్రహం ధ్వంసం అయ్యే అవకాశం ఉందన్నారు. 9 అడుగుల జైన శిల్పం కాయోత్సర్గాసనంలో నిలబడి ఉందని, విగ్రహం తలపై ఊష్ణిష చిహ్నం రాష్ట్ర కూటుల కాలపు జైన తీర్థంకర లక్షణానికి అద్దం పడుతోందని తెలిపారు. కొండకు దిగువన ఇటుక రాతి శకలాలు, రాతి స్తంభంపై పద్మాసనం వేసుకొని కూర్చున్న మహావీరుడి శిల్పంతోపాటు గ్రామంలో హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో జైన తీర్థంకరుల శిల్పాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నంగునూరులోని అరుదైన విగ్రహం చుట్టూ రాతిని తొలగించడంతో 11వ శతాబ్దపు ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయని వీటిని కాపాడాలన్నారు. కార్యక్రమంలో అహోబిలం కరుణాకర్, పవన్, శిల్పి సుధాకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి


