వట్‌పల్లి(అందోల్): తాళం వేసిన ఇంట్లో దొంగ చోరీకి పాల్పడిన ఘటన అందోలు మండల పరిధిలోని ఎర్రారం గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన శేషారెడ్డి ఫిబ్రవరి 7న కూతురికి ఆరోగ్యం బాగా లేదని కుటుంబంతో కలిసి ఇంద్రేశంకు వెళ్లి బంధువుల వద్ద ఉండి వారం రోజుల తర్వాత 14న రాత్రి ఎర్రారం గ్రామానికి చేరుకున్నాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.60 లక్షల నగదు కనిపించలేదు. ఇంట్లో దొంగలు పడ్డారని జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. శేషారెడ్డి ఇంటి సమీపంలో ఉండే బాయికాడి శ్రీశైలం దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. అతడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకోగా, నగదు బెట్టింగ్‌లు, జల్సాలకు ఖర్చయినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. కేసు విచారణలో కానిస్టేబుళ్లు సంజీవ్, అరవింద్, నర్సింహ గౌడ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.


