
చేపల కోసం చెరువులోకి దిగి..
కౌడిపల్లి(నర్సాపూర్): చేపల కోసం చెరువులోకి దిగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మహమ్మద్‌నగర్ పెద్ద చెరువు వద్ద ఆదివారం జరిగింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్త చెరువు తండా పంచాయతీ పరిధిలోని గూగ్లోత్ తండాకు చెందిన గూగ్లోత్ లక్ష్మణ్(32) కట్టెకోత కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి వద్ద కూలీపనులు చేశాడు. ఆదివారం లక్ష్మణ్ మహమ్మద్‌నగర్ చెరువు వద్దకు వచ్చాడు. అక్కడ సురేందర్‌రెడ్డి కూలీలతో చేపలు పట్టిస్తున్నాడు. తనకు చేపలు కావాలని అతడు చెరువులోకి దిగి ఈదుకుంటూ వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు విషయం చెప్పారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ అధికారులతో కలిసి చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చేగుంట చెరువులో..
చేగుంట(తూప్రాన్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్య కుమార్‌రెడ్డి కథనం ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన అమర్‌సింగ్(31) స్థానిక ఉన్న ఓ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం చేగుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మద్యం మత్తులో కిందపడి..
వెల్దూర్తి(తూప్రాన్): మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వెల్దుర్తి ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం... కొప్పులపల్లి గ్రామానికి చెందిన మల్గా సురేశ్(44) శనివారం కూలీ పనులకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వచ్చి కిందపడిపోయి నిద్రపోయాడు. ఆదివారం కుటుంబీకులు లేచి చూడగా అతడి నోట్లోంచి నురగలు వచ్చిన విషయం గమనించి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేపల కోసం చెరువులోకి దిగి..