
ఇస్లాంపురం, జీర్లపల్లి మధ్య బ్రిడ్జి వద్ద కుంగిన రోడ్డు
ఝరాసంగం(జహీరాబాద్): నిర్వహణ లోపంతో బ్రిడ్జిల వద్ద ప్రమాదం పొంచి ఉంది. మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులపై అవసరం ఉన్నచోట బ్రిడ్జిలను నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జిల వద్ద రోడ్లు కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. మండలంలోని బోరేగావ్, ఇస్లాంపురం, జీర్లపల్లితో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం మండల కేంద్రమైన ఝరాసంగం తోపాటు నియోజకవర్గ కేంద్రం జహీరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆయా గ్రామాల రహదారుల మధ్యన ఉన్న బ్రిడ్జిల వద్ద రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జికి సమాంతరంగా రోడ్డులేకపోవడంతో అదుపుతప్పి కిందపడి గాయాల పాలవుతున్నారు. వాహనాలు సైతం పాడవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రుల సమయంలో గుంత ఉన్న విషయం తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా బ్రిడ్జిల వద్ద రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.