గ్రూపు విభేదాలే కారణమా? ఓటమిపై అధిష్టానం ఆరా..

- - Sakshi

గెలుస్తుందనుకున్న దగ్గర ఎందుకు ఓడింది..

డిపాజిట్‌ కూడా దక్కకపోవడం ఆశ్చర్యం!

25,235 ఓట్లతో 3వ స్థానానికి పరిమితం..

సంగారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ హవా కొనసాగి అధికారంలోకి వస్తే.. దుబ్బాక నియోజక వర్గంలో మాత్రం పార్టీ ఘోరపరాజయం చవిచూసింది. మొదటి నుంచి గ్రూపు విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న దుబ్బాకలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని భావించిన అధిష్టానానికి నిరాశే మిగిలింది. గెలుపు కాదు కదా కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఓటమికి నేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలే కారణమా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న దానిపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం.

టికెట్‌ దక్కకపోవడంతో..
మొదటి నుంచి దుబ్బాక కాంగ్రెస్‌లో గ్రూపు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూపు విభేదాలు నెలకొనడంతో ఎన్నిసార్లు అధిష్టానం సమన్వయం కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఎన్నికల ముందు దుబ్బాక టికెట్‌ కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పన్యాల శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి, కత్తి కార్తీక తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు.

ఆఖరికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికే టికెట్‌ దక్కింది. దీంతో కత్తి కార్తీక ఎన్నికలకు నాలుగురోజుల ముందు బీఆర్‌ఎస్‌ చేరి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఇక టికెట్‌ రాకపోవడంతో శ్రావణ్‌ కుమార్‌రెడ్డి దుబ్బాక వైపే చూడకపోవడం తన అనుచరులు సైతం శ్రీనివాస్‌రెడ్డికి ఎన్నికల్లో సహకరించకపోవడం కనిపించింది.

డిపాజిట్‌ దక్కని పరిస్థితి!
దుబ్బాకలో ఈసారి కాంగ్రెస్‌ జెండా ఎగురతుందని అధిష్టానం ధీమాగా ఉండగా నియోజకవర్గంలో సైతం శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ కేటాయిస్తే తప్పకుండా గెలుస్తాడని సర్వేల్లో తేలింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో ఓ దశలో అంతు చిక్కని పరిస్థితి కనబడింది.

తీరా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్‌ కూడా దక్కకపోవడం శోచనీయం. చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కేవలం 25,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్‌ కు కావాల్సిన 28,894 ఓట్లకు 3,500 పై చిలుకు ఓట్లు దూరంగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. దుబ్బాకలో ఓటమిపై కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇవి కూడా చ‌ద‌వండి: సారూ..! మా గ్రామాల‌కు 'మహాలక్ష్మి' కరుణించేదెలా?

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top