కో ఆప్షన్ ఎవరికో?
జోగిపేట(అందోల్): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కో ఆప్షన్ సభ్యుల నియామకంపై పడింది. వార్డు కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయినందున ఎన్నికల్లో టికెట్లు లభించని వారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆ పదవులను దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. త్వరలో కో ఆప్షన్ పదవులకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది. జిల్లాలోని అందోలు–జోగిపేట, సంగారెడ్డి, సదాశివపేట, గడ్డపోతారం, ఇస్నాపూర్, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, కోహీర్, నారాయణఖేడ్, జహీరాబాద్ మున్సిపాలిటీలో ఆరు మున్సిపాలిటీలను కాంగ్రెస్, ఐదు మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ దక్కించుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలున్నచోట కోఆప్షన్ సభ్యుల పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఆష్టకష్టాలు పడుతున్నారు.
నలుగురికి అవకాశం
కో ఆప్షన్ పదవులు త్వరలో భర్తీ కానున్న నేపథ్యంలో ఎంతమందికి అవకాశం కల్పిస్తారోనన్న చర్చ సాగుతోంది. సాధారణంగా ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో నలుగురికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తారు. జిల్లాలోని 10 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 40 కో ఆప్షన్ పదవులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. నిబంధనల ప్రకారం మైనార్టీ కోటాలో ఇద్దరితోపాటు గతంలో పంచాయతీ, మున్సిపాలిటీల్లో వార్డు మెంబర్, కౌన్సిలర్‌గా పనిచేసిన వారికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది.
కో ఆప్షన్ సభ్యుడు కావాలంటే...
మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో పలు నిబంధనలను పాటించవలసి ఉంటుంది. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో నలుగురు సభ్యులను నియమించిన పక్షంలో వారిలో పరిపాలన అనుభవం కలిగిన వారికి రెండు పోస్టులు కేటాయిస్తుండగా, అందులో ఒకటి మహిళకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. కో ఆప్షన్ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఓటరు జాబితాలో రిజిష్టర్ అయి ఉండటంతోపాటు 21 ఏళ్లకు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మొదలుకుని వార్డు సభ్యుని వరకు ఎందులోనైనా ఐదు సంవత్సరాలకు తగ్గకుండా పాలన సాగించి ఉండాలి. అలాగే అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన వారికి మరో రెండు పోస్టులు కేటాయిస్తారు. అందులో కూడా ఒక పోస్టును మహిళకు రిజర్వు చేసే చాన్స్ ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళికా విభాగంలో పనిచేసి గెజిటెడ్ అధికారి హోదాలో రిటైర్ అయిన ఉద్యోగులు, అలాగే ఐదేళ్లకన్నా తక్కువ కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు సభ్యుడిగా పని చేసిన మాజీ ప్రజాప్రతినిధులు కో ఆప్షన్ సభ్యుల పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా అయిదేళ్లు పనిచేసిన ప్రజాప్రతినిధులు అర్హులు.
ఎన్నికల సమయంలోనే హామీలు
మున్సిపల్ ఎన్నిక సమయంలో వార్డు కౌన్సిలర్లుగా రిజర్వేషన్లు అనుకూలించక, గెలుపు గుర్రాలకు సీట్లు కేటాయించే సమయంలో చాలావరకు సిట్టింగ్‌లకు ఈ ఎన్నికల్లో పోటీకి అవకాశం లభించకపోవడంతో కో ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని కో ఆప్షన్ పదవుల పేరుతో బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఆశావహులంతా మంత్రి, ఎమ్మెల్యేల వద్దకు చక్కర్లు కొడుతున్నారు. జోగిపేటలో మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, శరత్‌బాబు, మైనార్టీ కోటాలో సీనియర్ జర్నలిస్టు ఎండీ ఫయాక్, గోహేర్‌లు ఆశిస్తున్నారు.
జిల్లాలో 11 మున్సిపాలిటీలు
ఒక్కో బల్దియాలో నలుగురికి అవకాశం త్వరలో నోటిఫికేషన్ విడుదల!! నాయకుల చుట్టూ ఆశావహులప్రదక్షిణలు


